‘ఆ.. కమిటీ’తో ఉపయోగమెంత..?

పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు ఇటీవలి కాలంలో ఎక్కువయ్యాయి. కింది స్థాయి నుండి ఉన్నతాధికారుల వరకూ వేధింపులకు పాల్పడుతున్నట్లు పలు సందర్భాల్లో వెలుగులోకి వచ్చిన సంఘటనల ద్వారా స్పష్టమవుతోంది. గత కొద్ది రోజులుగా ఓ మాజీ సర్వోన్నత న్యాయమూర్తి పైనా, మీడియాలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిపైనా వస్తోన్న లైంగిక వేధింపుల ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జరుగుతున్న లైంగిక వేధింపులపై మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు మంగళవారం నాడు లైంగిక వేధింపుల ఫిర్యాదులు స్వీకరించి, పరిష్కరించడానికి ఒక అంతర్గత కమిటీని వేసింది. ఈ కమిటీలో పదిమంది సభ్యులు ఉంటారు. అయితే.. సుప్రీం వేసిన ఈ కమిటీ సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో జరిగిన లైంగిక వేధింపులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటుంది.
   తాజాగా ఒక న్యాయ విద్యార్థిని.. తాను సుప్రీంకోర్టు జడ్జి చేతిలో లైంగిక వేధింపులకు గురైనట్లు పేర్కొంది. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సర్యోన్నత న్యాయస్థానం దీనిపై విచారించేందుకు ముగ్గురు జడ్జిలతో కూడిన కమిటీని వేసింది. విచారణ ఎదుర్కొన్న సదరు న్యాయ విద్యార్థిని ఒక విదేశీ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించింది. వేధింపులు జరిగిన వెంటనే ఫిర్యాదు చేయలేకపోవడానికి కారణం.. వేధించిన వ్యక్తి కీలక స్థానంలో ఉండటమే అని పేర్కొంది. అంటే ఆ వ్యక్తికి భయపడే ఆమె అప్పట్లో ఫిర్యాదు చేయలేదన్న విషయం స్పష్టమవుతోంది. ఇక తెహల్కా తేజ్ పాల్ కేసులోనూ కొన్ని రోజుల దాకా..లైంగిక వేధింపుల విషయం వెలుగులోకి రాలేదు. ఇక్కడ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న అతను ఉన్నత స్థానంలో ఉన్నాడు. బాధితురాలు తన బాస్ కు భయపడే వేధింపుల విషయంపై ఫిర్యాదు చేయలేదు.
    ఈ రెండు కేసుల్లోనూ బాధితులిద్దరూ చట్టం గురించి అవగాహన ఉన్నవారే. అయినా వీరే న్యాయ వ్యవస్థపై భరోసాగా లేకుంటే ఇక సామాన్యులు ఎలా ఫిర్యాదులు చేయగలరు..? ఈ ఉదంతాల నేపథ్యంలో ఇప్పుడు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ వల్ల ఉపయోగం ఉంటుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. సర్యోన్నత న్యాయస్థానం తాజా కమిటీకి సూచించిన ప్రకారం… సుప్రీంకోర్టు ఆవరణలో వేధింపులకు గురైన మహిళలు చేసే ఫిర్యాదులను మాత్రమే కమిటీ పరిశీలిస్తుంది. న్యాయ విద్యార్థులు, జూనియర్ లాయర్లు, క్లయింట్లు తమ అవసరాలకు అనుగుణంగా లాయర్లు, జడ్జిల ఇళ్లకు లేదా వారి ప్రయివేటు ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మరి అక్కడ లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలన్నది ప్రశ్నగా మిగిలింది. మరో వైపు 16 ఏళ్ల కిందట(1997) ‘విశాఖ’ కేసు పేరిట పని స్థలంలో వేధింపులకు సంబంధించి సుప్రీంకోర్టు కొన్ని మార్గదర్శకాలను వెలువరించింది.
ఆ మార్గదర్శకాలను ఒకసారి పరిశీలిస్తే..
* పనిచేసే ప్రదేశం యజమాని గానీ.. బాధ్యతాయుతమైన వ్యక్తి గానీ సదరు సంస్థలో లైంగిక వేధింపులు నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.
* సుప్రీంకోర్టు నిర్ధేశించిన ప్రకారం లైంగిక వేధింపులంటే ఏమిటి..? అనే అంశాన్ని సంస్థలో అందరికీ తెలిసేలా చేయాలి. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు ఉద్యోగులకు పంపిణీ చేయాలి.
* లైంగిక వేధింపులు నిషేధిస్తూ.. క్రమశిక్షణకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ను సంస్థ ఏర్పాటు చేసుకోవాలి.
* క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
* ఉద్యోగినులు ప్రశాంతంగా పనిచేసుకోవడానికి అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి.
* వారి పని గురించి, విరామం గురించి, ఆరోగ్య పరిస్థితుల గురించి యాజమాన్యం పట్టించుకోవాలి.
* సంస్థలో ప్రతికూల వాతావరణం లేకుండా చూడాలి.
* ఈ మార్గదర్శకాల స్థానంలో సరైన శాసనం వచ్చేంత వరకూ వీటిని అమలు చేయాలి.
   కానీ.. సుప్రీం రూపొందించిన ఈ మార్గదర్శకాలు పేపరు మీద పటిష్టంగానే ఉన్నప్పటికీ.. అమలుకు వచ్చేసరికి నామమాత్రంగా తయారయ్యాయి. ఈ నిబంధనలు ఏ పని ప్రదేశంలోనూ కచ్ఛితంగా అమలవుతున్న దాఖలాలు లేవు. అలాంటి మార్గదర్శకాలను అనుసరిస్తూనే తాజాగా ఏర్పడిన కమిటీ సైతం పని చేయాలని ధర్మాసనం సూచించింది. మరి.. ఈ నేపథ్యంలో కొత్తగా కమిటీ వేసినప్పటికీ సర్వోన్నత న్యాయస్థానంలో లైంగిక వేధింపులు అరికట్టబడతాయా? అన్నది సందేహమే! ఇక జడ్జి చేతిలో వేధింపులకు గురయ్యానంటూ పేర్కొన్న యువతి విచారణ కమిటీ పై చేసిన వ్యాఖ్యలు ఇలాంటి కమిటీలపై విశ్వసనీయతను తగ్గించే విధంగానే ఉన్నాయి. కమిటీ సభ్యులు తన ఫిర్యాదును.. .తాను చెప్పే విషయాలను అనుమానంగా వింటున్నారని ప్రతి సారీ తాను నిజమే చెబుతున్నానని చెప్పుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు అరకొర మార్గదర్శకాలతో ఏర్పాటు చేసిన కమిటీ కనీసం సర్వోన్నత న్యాయస్థానం పరిధిలో పనిచేసే మహిళలకైనా రక్షణ కల్పిస్తుందా..? అని అనుమానాలు తలెత్తుతున్నాయి.
అంతర్గత కమిటీ సభ్యులు వీరే…
జస్టిస్ రంజన ప్రకా ష్ దేశాయ్
జస్టిస్ మదన్ బి.లోకూర్
ఎల్.నాగేశ్వరరావు ( సీనియర్ న్యాయవాది)
ఇందు మల్హోత్రా (సీనియర్ న్యాయవాది)
బీనా మాధవన్ (సీనియర్ న్యాయవాది)
బి.సునీతారావు (సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ప్రతినిధి)
మధు చౌహాన్, సుప్రీంకోర్టు గుమస్తాల సంఘం ప్రతినిధి
రచనా గుప్తా, అదనపు రిజిస్ట్రార్
ప్రొ.జి.మోహన్ గోపాల్, డైరెక్టర్, రాజీవ్ గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ స్టడీస్
భారతీ అలీ, బాలల హక్కుల సంస్థ కో-డైరెక్టర్

Advertisements